Futuristic Rayalaseema
About Leader
Job Portal

అనంతపూర్ జిల్లాలో బస్సుల తయారీ ఫ్యాక్టరీ ని పెట్టనున్న ప్రఖ్యాత సంస్థ వీరా

kj reddy

రూ.600 కోట్ల పెట్టుబడితో ఏటా 8 వేల బస్సుల తయారీ కి సన్నాహాలు  

రెండు దశల్లో 7 వేల మందికి లభించనున్న ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు 

రాయలసీమ ప్రాంతంలో కరవు జిల్లాగా పేరుగాంచిన అనంతపూర్ జిల్లాకు త్వరలో ఒక  భారీ పరిశ్రమ రానుంది. బస్సుల తయారీలో  పేరుగాంచిన  వీరా వాహన సంస్థ గూడుపల్లి వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో తన ఫ్యాక్టరీ ని పెట్టనుంది. ఈ బస్సుల తయారీ యూనిట్‌ను రెండు దశల్లో నెలకొల్పడానికి సంస్థ ముందుకు వచ్చింది. గత నవంబర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర పరిశ్రమల శాఖతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.

       గూడుపల్లి వద్ద తమ ప్లాంటును  ఏర్పాటు చేయడానికి వీర వాహన సంస్థ పలు ప్రోత్సహకాలు, రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి  కోరింది. ఎకరా స్థలాన్ని తమకు రూ.5లక్షలకు ఇవ్వాలని కోరింది. ఈ సంస్థ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఎకరా ధర రూ.6లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా  ప్రవేశ పన్ను మినహాయింపు, స్టాంపు రుసుం వంద శాతం రాయితీ, వ్యాట్‌ పన్నును ఏడు సంవత్సరాల పాటు వంద శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడానికి అనుమతిచ్చింది. ఏడు సంవత్సరాల పాటు యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా ఏడు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మొదటి దశలో ఏటా 8 వేల బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉన్న యూనిట్‌ను నెలకొల్పతారు. దాని ద్వారా ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.

            రెండో దశలో 12 నుంచి 18 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న చిన్న బస్సులను తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మరో రెండు వేల మందికి ఉపాధి కలగనుంది.  వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థ బెంగళూరులో ప్రస్తుతం పెద్ద తయారీ యూనిట్‌ను నెలకొల్పింది.దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన దాదాపు రెండు వేలకుపైగా బస్సులు పరుగులు తీస్తున్నాయి.