Futuristic Rayalaseema
About Leader
Job Portal

తొలి బడ్జెట్‌ సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ముస్తాబు

kj reddy

భారీ భద్రత మధ్య జరుగనున్న సమావేశాలు 

వెలగపూడికి వెళ్లే అన్ని మార్గాల్లో 15 చెక్‌పోస్టులు ఏర్పాటు 

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ తొలి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర రాజధాని అమరావతి ముస్తాబైంది.  వెలగపూడిలో కొత్తగా నిర్మించిన భవనం నుంచి తొలిసారిగా వచ్చే నెల మార్చి 6 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి జరిగినన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సహా ఉన్నతాధికారులంతా సమావేశాలు ఏ మార్గం నుంచి బయలుదేరినా సకాలంలో వారు సచివాలయం, అసెంబ్లీ భవనాలకు చేరుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అసెంబ్లీ కొలువుదీరిన వెలగపూడి ప్రాంతానికి చేరుకునే అన్ని మార్గాల్లో 15 అంతర్గత తనిఖీకేంద్రాలు (చెక్ పోస్టులు)  ఏర్పాటు చేయనున్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు 18 రోజులపాటు జరగనున్నాయి. సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా  ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు  అసెంబ్లీ వెలుపల ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉండడంతో . ఆయా సంస్థలు, రాజకీయ పార్టీలకు చెందిన ఆందోళనకారులు నిరసన తెలపటానికి ఒక ధర్నాచౌక్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలనీ అధికారులు నిర్ణయించారు. ఆందోళనలు, ధర్నాలకు పెద్దఎత్తున ప్రజలను సమీకరిస్తారు. వారంతా ధర్నాచౌక్‌కు హాజరుకావటానికి వీలుగా రవాణా వసతి ఉండాలి.                                                                                                                  ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు విజయవాడకు చేరుకోవటానికి బస్సు, రైల్వేవంటి సౌకర్యాలు బాగా ఉన్నాయని, విజయవాడ కేంద్రంగానే ఆందోళనలు చేసుకోవటానికి తాత్కాలిక ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీ కొలువుదీరిన వెలగపూడికి విజయవాడ గుంటూరువైపు నుంచి సులభంగా చేరుకునేలా రోడ్డుమార్గాల్లో ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మార్గాల నుంచి ఆందోళనకారులు అసెంబ్లీ ప్రాంగణలోకి చొచ్చుకురాకుండా ప్రధానరహదారుల్లో ఎక్కడికక్కడ పోలీసు బారికేడ్లు, ఇనుపకంచె అమర్చనున్నారు.  గుంటూరు జోన్‌ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి 30 మంది డీఎస్పీలు, 70మంది ఇన్‌స్పెక్టర్లు, వందమంది ఎస్సైలు, వందల సంఖ్యలో కానిస్టేబుళ్లు బందోబస్తు విధులకు  రానున్నారు.  ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో భారీ రిహార్సల్స్‌కు పోలీస్ డిపార్టుమెంట్ సన్నాహాలు చేస్తోంది.