Futuristic Rayalaseema
About Leader
Job Portal

ఫలించనున్న పులివెందుల వాసుల దశాబ్దాల కల

kj reddy
ఈ నెల 11,  గండికోట ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు 
రాయలసీమ జిల్లా ఐన కడప లోని పులివెందుల వాసుల దశాబ్దాల నీటి కల త్వరలోనే నెరవేరనుంది.  ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఈ నెల 11న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. గండికోట ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా  పులివెందులకు నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్రంలో పూర్తికాకుండా ఉన్న ప్రాజెక్టులన్నింటికీ మోక్షం కలిగించే విధంగా తాము  కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు అంటే  10 ఏళ్ల సమయం తీసుకోవడం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత... ఆదాయం వచ్చే మార్గం లేకపోయినా ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు తాగు, సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.  పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన ఈ రోజు అన్ని వర్గాల వారికీ పండగ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏలేరు ఆయకట్టు కింద రైతులు పది సంవత్సరాలు పోరాడారని గుర్తుచేశారు. 
తాను రాష్ట్రంలోని ఏ ప్రాంతం పైన  వివక్ష చూపడం లేదని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేసారు.  తనకు అన్ని ప్రాంతాలు సమానమేనని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. ఈ శంకుస్థాపన  కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు  పాల్గొన్నారు.