Futuristic Rayalaseema
About Leader
Job Portal

ప్రభుత్వ అధికారుల దృష్టి పడితే అద్భుతమైన పారిశ్రామిక వాడగా మారనున్న ఓర్వకల్లు:

kj reddy
ఓర్వకల్లు... కర్నూల్ పట్టణానికి కేవలం 18 km దూరంలో గల మండల కేంద్రం. అంతేగాకుండా, అతి త్వరలోనే ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ప్రాంతం. 
ఇందుకు కారణం ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవరమైన భూమి  సమృద్ధిగా అందుబాటులో ఉండడం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014 లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ప్రసంగంలో , ఓర్వకల్లు ను  ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చ్చారు. హామీ ఇవ్వడమే కాక దాన్ని వెంటనే ఆచరణలో కూడా పెట్టారు. ఓర్వకల్లు మండలంలో గల ఏడు వేల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని రాష్ట్ర రెవిన్యూ శాఖ వెంటనే  ఏపీఐఐసీకి అప్పగించింది.  ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక హబ్ నెలకొల్పడానికి మరో 2400  ఎకరాల ప్రైవేట్ భూమి అవసరమని తేల్చారు. ఈ భూమి సేకరణకు తమను అనుమతించాలని కూడా వారు ప్రభుత్వాన్ని కోరారు.  
అయితే.. ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వారి దృష్టిని తనవైపు తిప్పాలని కలవరిస్తోంది. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు పారిశ్రామిక ప్రాంతంగా ఓర్వకల్లు ను మార్చడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన అంశాన్ని మాత్రం ప్రభుత్వ అధికారులు పక్కన పెట్టేసారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 40  టీఎంసీ ల నీళ్లను ప్రాజెక్ట్ కు సరఫరా చేయొచ్చని ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు, నీళ్లను ఏ విధంగా సరఫరా చేయాలనే అంశాలతో కూడిన తుది నివేదికను మాత్రం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. దీంతో ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి బలమైన కోరికను నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం మాట ఇలా ఉంటే  మరోవైపు, ఓర్వకల్లు లో తమ పరిశ్రమలను స్థాపిస్తామని 400 మందికి పైగా చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. అంతే కాకుండా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ 2935 కోట్లకు పైగా పెట్టుబడులను ఓర్వకల్లు లో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 370 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓర్వకల్లు లో కేటాయించింది. ఈ సంస్థ పెట్టబోయే పెట్టుబడుల వల్ల 6000 మందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్నూల్ ప్రాంతానికి చెందిన యువత పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక హబ్ కు సంబంధించిన మౌలిక వసతులను వెంటనే అధికారులు సమకూర్చాలని కోరుతున్నారు.