Futuristic Rayalaseema
About Leader
Job Portal

సంక్రాంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

kj reddy
-రాయలసీమ ప్రాంతాలు తిరుపతి, కడప, పుట్టపర్తి లోని శిల్పారామంలలో పండగ సంబరాలను నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం 
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పండుగలో భాగంగా జరుపుకునే సంబరాలను ఘనంగా నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా గ్రామ, మండల, జిల్లా ఇలా వివిధ స్థాయిల్లో అధికారికంగా సంబరాలను నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. రాయలసీమ ప్రాంతాలైన తిరుపతి, కడప పుట్టపర్తి కోస్తా ప్రాంతమైన విశాఖపట్నంలోని శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించాలని ఆదేశించింది. సంక్రాంతి పండుగ‌ను రాష్ట్ర ప్ర‌జలంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చేసుకోవాల‌న్న‌దే రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఉద్దేశ‌మ‌ని, దీనికోసం రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు ఖ‌ర్చు చేయ‌డానికి కోటి చొప్పున 13 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను మంజూరు చేసిన‌ట్లు రాష్ట్ర స‌మాచార‌, ఐటి, సాంస్కృతిక శాఖ మంత్రి డా. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి చెప్పారు. ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి అని..ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతులకు కూడా ఈ సంద‌ర్భంగా అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు. సంక్రాంతి రోజుల్లో తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయ‌న్నారు. పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారుల విన్యాసాలు..ఎడ్ల పందాలు, హ‌రిదాసులు, రంగురంగుల ముగ్గులు...వాటి మ‌ధ్య కొలువుదీరిన గొబ్బెమ్మ‌లు, భోగి మంట‌లు, రేగుప‌ళ్లు వంటివ‌న్నీ సంక్రాంతికి మ‌రింత శోభ తెస్తాయ‌న్నారు. ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరించే ఆడ‌ప‌డుచులు సంతోషంగా ఉండేలా చూడాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి ధ్యేయ‌మ‌న్నారు. ఆడ‌ప‌డుచుల కోసం ప్ర‌త్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి ప‌ల్లె తెలిపారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ పండుగ‌ను ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. స‌చివాల‌యంలో ఉద్యోగులంతా ఆనందంగా పండుగ సంబురాల్లో పాల్గొనేందుకు ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల రూపాయ‌లు నిధులు మంజూరు చేశామ‌ని మంత్రి ప‌ల్లె వివ‌రించారు. రాష్ట్రంలో ప్ర‌తి తెల్ల‌కార్డుదారుడికీ చంద్ర‌న్న సంక్రాంతి కానుక అంద‌చేశామ‌ని... ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో... సంక్రాంతిని చేసుకోవాల‌ని, కుటుంబ‌స‌భ్యులు, బంధువులు అంతా క‌లిసిమెలిసి ఈ పండుగ‌ను వేడుక‌గా చేసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినందుకు మంత్రి ప‌ల్లె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.