Futuristic Rayalaseema
About Leader
Job Portal

అనంతపురం జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా మారుస్తాం:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు...

కరవు జిల్లా గా పేరుగాంచిన అనంతపూర్ జిల్లా దశ దిశా మార్చే రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ టెక్ పార్క్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని చిలమత్తూరు గ్రామంలో పార్కు కు సంబందించిన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
అత్యంత ఆర్భాటంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,రాగ మయూరి పార్క్ అధినేత కేజె రెడ్డి గారు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అనంతపూర్ జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.

అనంతపూర్ జిల్లాను తెలుగు దేశం పార్టీ కంచుకోటగా అభివర్ణించిన ఆయన, జిల్లా అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అనంతపూర్ జిల్లాలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను దూరం చేయడానికి రాగ మయూరి టెక్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్త కేజె రెడ్డి గారిని అభినందించిన అయన, పార్కు అభివృద్ధికి ఆవరసరమైన అన్ని చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, పార్క్ ను ప్రమోట్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయడమే కాకుండా, రాగ మయూరి ఎలక్ట్రానిక్స్ పార్కుని మోడల్ పార్క్ గా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన ప్రకటించారు.

అనంతపూర్ అభివృద్ధి జిల్లాకు రానున్న రోజుల్లో హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇస్తామని ఆయన ఈ సంధర్బంగా ప్రకటించారు. జిల్లాలోని చెరువులన్నింటిని నీటితో నింపుతామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అనంతపూర్ జిల్లాకు దగ్గరగా ఉన్నందున, జిల్లాలోని పరిసర ప్రాంతాలన్నీ బాగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో అనంతపూర్ జిల్లాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ కస్టమ్స్ అకాడమీ వంటివి రాబోతున్నాయని, ఈ జాతీయ సంస్థల ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందనుందని ఆయన అన్నారు.